
విశాఖ: ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్ సేవలు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత స్కూట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ బయల్దేరింది. సోమవారం ఉయదం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీసు భోగాపురం చేరుకుంది. దీనికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. ఉదయం 7:30 తర్వాత తొలి విమానం హైదరాబాద్ వెళ్లింది. 8 గంటలకు బెంగళూరుకు, 8.20కి దిల్లీకి, 8.50కి హైదరాబాద్‌కు సర్వీసులు బయలుదేరతాయి. విశాఖ నుంచి భోగాపురం రావడానికి 20 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేశారు. భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. ఇండిగో, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ లాంటి దేశీయ విమాన సర్వీసులతోపాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్‌లైన్స్ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబికి కూడా వెళ్లే అవకాశం ఉంది. సోమవారం 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా వీటిద్వారా సుమారు తొలిరోజు 6-7వేల మంది ప్రయాణించనున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి చిట్టచివరి సర్వీసుగా దిల్లీ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు బయల్దేరింది. తర్వాతి నుంచి వాణిజ్యపరమైన సేవలు ఆగిపోయాయి. విశాఖ విమానాశ్రయంలో ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేయగా.. వీరంతా ఎక్కడ సేవలందిస్తారనే దానిపై స్పష్టత లేదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి
