
ఇంటర్నెట్ డెస్క్: కరూర్ తొక్కిసలాట ఘటన కచ్చితంగా రాజకీయ కుట్రేనని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. ఆ ర్యాలీకి ఎక్కువ మంది వచ్చారని తెలిసినా.. నాడు పోలీసులు దాన్ని ఎందుకు మధ్యలోనే రద్దు చేయలేదని ప్రశ్నించారు. తాను పోలీసులను నమ్మితే.. మరణాలకు తననే నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్‌లో పర్యటించిన విజయ్ (Vijay).. నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఒక మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించినా సరే.. తన జీవితంలో ఎక్కడో ఓ చోట బాధాకరమైన క్షణాలను ఎదుర్కోక తప్పదు. నా రాజకీయ ప్రయాణంలో కరూర్ ఘటన (Karur Stampede) అలాంటిదే. ఆ తొక్కిసలాటలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు. దీనికి బాధ్యులెవరు? ఆ రోజు ర్యాలీకి రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులకు అనిపించినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది. లేదా సమావేశాన్ని రద్దు చేయాల్సింది. వారికి అన్ని హక్కులూ ఉన్నాయి కదా..! కానీ, అవేవీ చేయకుండా వారు చోద్యం చూశారు. బహుశా అలా చేయమని వారిపై ఎవరి (నాటి డీఎంకే ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఒత్తిడైనా ఉండి ఉంటుంది. రద్దీని నియంత్రించగలరని నేను పోలీసులను నమ్మాను. కానీ, నా వల్లే మరణాలు జరిగాయని నాడు నాపై నిందలేశారు. ఘటన తర్వాత నేను పారిపోయానని ప్రత్యర్థులు నాపై బురదజల్లారు. కానీ, నేను పారిపోలేదు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా’’ అని విజయ్ అన్నారు. కరూర్ విషాదాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని, మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరఫున స్మారకాన్ని నిర్మిస్తానని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల జరిగిన ప్రయత్నాలపై విజయ్ స్పందించారు. ప్రజలు తనవైపే ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తమను అధికారంలో నుంచి దించలేరంటూ డీఎంకే- అన్నాడీఎంకేపై పరోక్ష విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాయని విజయ్ విమర్శించారు. తమ హయాంలో ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి