
JD Vance PM Modi Phone Call : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్ – అమెరికా సంమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ సంభాషణలో భాగంగా జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ ఇటీవల మగ బిడ్డకు జన్మించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వాన్స్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు మోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. భారత్ - అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత లోతుగా తీసుకెళ్లే మార్గాలపై చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే ఈ ఫోన్ సంభాషణకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, తుర్కియో, పాకిస్థాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అంశం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. గతకొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి బలోపేతం చేసేందుకు రెండు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి