
భారత్, పాకిస్థాన్ మధ్య చారిత్రక సింధు జలాల ఒప్పందంపై వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటివరకు కేవలం రాజకీయ నాయకులకే పరిమితమైన హెచ్చరికలు, ఇప్పుడు పాక్ సైనిక నాయకత్వం నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. సింధు జలాల్లో తమకు న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను దక్కించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా హెచ్చరించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలను మరింత జఠిలం చేస్తోంది.పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధ్యక్షతన జరిగిన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వ ఆదేశాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధు జలాల్లో తమ హక్కును కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని సైన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదా మళ్లించడాన్ని 'యుద్ధ చర్య'గా పరిగణిస్తామని గత ఏడాది ఏప్రిల్ 24న పాక్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్‌సీ) చేసిన తీర్మానాన్ని ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు. దేశ సన్నద్ధత, వృత్తి నైపుణ్యం పట్ల సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది.మరోవైపు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాలను భారత్ ఒక 'ఆయుధం'గా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అవసరమైతే భారత్‌తో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు