
ప్రభుత్వంతో సమాధానాలిప్పించే బాధ్యత నాది వైకాపా ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడి సూచన ఈనాడు, అమరావతి: డీఎస్సీ, ఇతర అంశాలపై వైకాపా అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట, రోడ్లపై మాట్లాడడం కాదు, ఏవైనా అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెబుతుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎక్కడో రోడ్లపై మాట్లాడి సమాధానం చెప్పాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా జగన్, ఆయన పార్టీ సభ్యులు సభకు వచ్చి మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటున్న జగన్ వాదనపై స్పీకర్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే తగిన సంఖ్యాబలం ఉండాలి. గతంలో తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు.. వారిలో ఐదారుగురిని ఇటు లాగేస్తే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా మిగలదు అని చంద్రబాబుతో నాటి ముఖ్యమంత్రి జగన్ ఇదే అసెంబ్లీలో అనలేదా? ఇప్పుడు జగన్‌కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా నేను ఎలా ఇవ్వగలను? మీ 11 మంది ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అక్కడే మంత్రులు ఉంటారు. వారితో సమాధానం ఇప్పించే బాధ్యత స్పీకర్‌గా నేను తీసుకుంటా’ అని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలు అవుతాయంటూ వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పీకర్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యుల వసతి కోసం రాజధానిలో క్వార్టర్లను కట్టిస్తే, వాటి గురించి గతంలో మంత్రిగా కూడా పనిచేసిన పేర్ని నాని తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? లేనిపోని అపోహలు సృష్టించి, తప్పుడు మాటలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేను వెనుకాడను’ అని స్పీకర్ హెచ్చరించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి