
తేజ సజ్జ హీరోగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ సినిమా ‘మిరాయ్’ (Mirai) విడుదల కాకముందే జపాన్‌లో అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ఆగస్టు 21న జపాన్‌లో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో అడ్వాన్సు బుకింగ్స్ జరుగుతున్నాయి. జపాన్‌లో తొలి రోజు అడ్వెన్స్ బుకింగ్స్ పరంగా ‘మిరాయ్’ అత్యంత వేగంగా దూసుకుపోతూ, అక్కడి టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా టాలీవుడ్ నుంచి జపాన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న అతికొద్ది చిత్రాల సరసన నిలిచింది ‘మిరాయ్’. కేవలం 5 తెలుగు సినిమాలు మాత్రమే ఇంతటి అద్భుతమైన ఓపెనింగ్ అడ్వెన్స్ బుకింగ్స్ రికార్డును సాధించడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’, రాజమౌళి తీసిన ‘బాహుబలి 2’ చిత్రాల రికార్డులకు అతి సమీపంలో కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా 2 రోజులు సమయం ఉండటంతో, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జపాన్ టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ మరింత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్, పూర్తిస్థాయి విలన్ పాత్ర పోషించాడు