
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, గ్రూప్-1 వ్యవహారంలో వారి తప్పిదాలను ప్రజల ముందు ఉంచాలని మంత్రులను ఆదేశించారు. బుధవారం అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో నిర్వహించిన భోజన విందు సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని, ఒకే పత్రాన్ని మూడుసార్లు మూల్యాంకనం చేయడం మునుపెన్నడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. గ్రూప్-1 అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే గౌరవ హైకోర్టుకు నివేదిక సమర్పించిందని వెల్లడించారు. మంత్రులందరూ ఆ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అందులోని వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, శాసనసభలోనూ ఈ అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆయన సూచించారు.మరోవైపు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఇందులో ఎటువంటి అవకతవకలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనమండలిలో డీఎస్సీపై వైసీపీ నేతలు చేసే ఆరోపణలను వాస్తవాలతో తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. "చట్టసభలకు హాజరుకాకుండా బయట డ్రామాలు ఆడితే ప్రజలు విశ్వసించరు. అసలు సభకే రాని వారు ప్రతిపక్ష హోదాను ఎలా ఆశిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు దూకుడుగా వ్యవహరించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు