
కూడళ్ల వద్ద గుండ్రంగా భవనాల మూలలు! ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలు అవసరమైతే ప్రహరీ, చెట్లు తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్లకు అధికారాలు నష్టం జరిగితే యజమానులకు పరిహారం ‘క్యూర్’ ముసాయిదాలో కొత్త నిబంధనలు హైదరాబాద్ సిటీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోడ్ల కూడలి.. నలువైపులా ముందుకు చొచ్చుకొచ్చినట్టుగా భవనాల మూలలు.. మలుపు తర్వాత ఎలా ఉందో సరిగా కనిపించదు.. సిగ్నల్ వద్ద ఆగే వాహనాలతో రోడ్డు నిండిపోయి మలుపు తీసుకోలేక ఇబ్బంది.. ప్రమాదాలూ జరిగే అవకాశం.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సమస్య ఎక్కువ. ఈ నేపథ్యంలో కూడళ్ల వద్ద భవనాల మూలలను.. 90డిగ్రీల కోణంలో కాకుండా గుండ్రంగా లేదా ఏటవాలుగా ఉండేలా సరికొత్త నిబంధనలను అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి భద్రత, ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)’ బిల్లు-2026 ముసాయిదాలో ఈ మేరకు నిబంధనలను ప్రతిపాదించింది. వాటి ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ వీధులు కలిసే కూడళ్ల వద్ద ఉన్న భవనాల రోడ్డువైపు మూలలను అవసరాన్ని బట్టి గుండ్రంగా గానీ, ఏటవాలుగా గానీ మార్చాలని ఆదేశించే అధికారం సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు ఉంటుంది. ప్రస్తుతమున్న, నిర్మాణంలోని, భవిష్యత్తులో నిర్మించబోయే, మరమ్మతులు చేపట్టనున్న భవనాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఇందుకోసం స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని బిల్లు ముసాయిదాలో పేర్కొన్నారు. ఇక భవనాల మూలల మార్పుతో పాటు ప్రహరీలు, ఫెన్సింగ్, చెట్లపొదలు (హెడ్జ్‌లు), ప్రాంగణంలోని చెట్లకు సంబంధించి కూడా అవసరాన్ని బట్టి మార్పులు చేసేలా, తొలగించేలా ఆదేశించేందుకు కమిషనర్‌కు అధికారం ఉంటుంది. అయితే దీనివల్ల యజమానికి జరిగే నష్టానికి క్యూర్ చట్టంలోని నిబంధనల ప్రకారం తగిన పరిహారం చెల్లిస్తారు. అటు ప్రజా ప్రయోజనాలు, ఇటు ఆస్తి యజమానుల హక్కుల మధ్య సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రజలు ఉండే ప్రతీ వీధిలో విద్యుద్దీపాలు ప్రజలు నివాసం ఉండే