
హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్న టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇటీవల నెట్టింట ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. అమ్మవారితో కలిసి బోనం ఎత్తి, పోతురాజులతో అడుగులేసిన ఆమెపై సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో ఫరియా ఎమోషనల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ లో భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీటి పర్యంతమైన ఫరియా తన కుటుంబ నేపథ్యం, మత విశ్వాసాల గురించి స్పష్టతనిచ్చింది. తన తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించారని, ఆ మతంలోని సత్ప్రవర్తన, మంచి గుణాలనే తనకు నేర్పించారని ఆమె వెల్లడించింది. “అల్లా అన్నింటా ఉంటారు” అనే తన తల్లి మాటలను గుర్తుచేసుకుంటూ, ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూస్తానని తెలిపింది. తనను ‘కాఫిర్’ అంటూ ట్రోల్ చేస్తున్న వారిపై కూడా ఫరియా సానుకూలంగా స్పందించడం గమనార్హం. తనను ద్వేషించేవారికి కూడా ప్రేమనే పంచుతానని, వారి మంచి కోసమే ప్రార్థిస్తానని ఆమె పేర్కొంది. ‘అల్లా’ అంటే అర్థం తనకు తెలుసని, సర్వాంతర్యామి అని, అందరినీ ఏకం చేసే దివ్య వెలుగు అని ఫరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ, పెద్ద చర్చకు దారితీసింది. మతాలకంటే మానవత్వం, ప్రేమ, ఐక్యతలే ముఖ్యమంటూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలను చాలామంది సమర్థిస్తున్నారు. కాగా, ఫరియా అబ్దుల్లా నటించిన ‘సిగ్మా’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది