
న్యూస్‌టుడే, గంగాధర: పిల్లలు చిన్నతనంలో ఉండగానే భర్త మృతి చెందాడు. బీడీలు చుడుతూ ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. ఎదిగిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే రోడ్డు ప్రమాదంలో జీవచ్ఛవంలా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. అతడి దీనస్థితి చూసి తల్లడిల్లుతోంది. నెల రోజులుగా ఆసుపత్రిలోనే అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుండగా.. వైద్యానికి డబ్బులు వెచ్చించడానికి పేదరికం అడ్డుగోడగా మారింది. ఇప్పటికే దాతలు తోచినంత సాయం అందించగా.. రోజుకు రూ.వేలల్లో ఖర్చు అవుతుండటంతో పరిస్థితి ఎలా అని ఆందోళన చెôదుతోంది. గంగాధరకు చెందిన ఊరడి రాజేశం, వరలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. కుమారుడు సాయికుమార్ ఏడాది ప్రాయంలోనే రాజేశం మృతి చెందగా తల్లి బీడీలు చుడుతూ పిల్లలను పోషించి కూతుళ్లకు పెళ్లిళ్లు జరిపించారు. సాయికుమార్ కరీంనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ద్విచక్రవాహనంపై జులై 12న స్వగ్రామానికి వస్తుండగా.. ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పేదరికంతో ఖరీదైన వైద్యం చేయించలేకపోవడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో రూ.5 లక్షల సీఎం సహాయనిధి అందింది. ఈ డబ్బులు సరిపోకపోవడంతో దాతలు రూ.3 లక్షలు, అక్కలు రూ.2 లక్షలు, పెద్దమ్మ కుమారుడు రూ.70వేలు వైద్యానికి వెచ్చించారు. వారం రోజుల తర్వాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా మొన్నటివరకు రోజుకు రూ.30 వేల చొప్పున వైద్యానికి ఖర్చు చేశారు. ప్రస్తుతం రోజుకు రూ.15 వేలు ఖర్చు వస్తోంది. ఇప్పటికే రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు బాధితులు వాపోయారు. సాయికుమార్ చూపు మాత్రమే ఉండగా శరీరంలో ఎలాంటి కదలిక లేదని, సాధారణ స్థితికి సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారని కుటుంబీకులు వాపోయారు. ఆస్తులు లేక పేదరికంతో అల్లాడుతున్న సాయికుమార్ వైద్యానికి దాతలు చేయూత ఇవ్వాలని వేడుకుంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి