
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఆలయ ప్రాంగణంలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సమీపిస్తున్న వేళ, ఈ వేడుకను ఉద్దేశించి సాయి తేజ్ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది.వివరాల్లోకి వెళితే.. సాయి దుర్గా తేజ్ కాణిపాకం ఆలయానికి చెందిన వసతి గృహంలో (గెస్ట్‌హౌస్) తన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో వివాదం మొదలైంది. అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వ్యక్తిగత వేడుకలు నిర్వహించడం ఏమాత్రం సరికాదని పలువురు భక్తులు, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఆధ్యాత్మిక వాతావరణానికి నెలవైన పుణ్యక్షేత్రంలో వ్యక్తిగత సంబరాలకు చోటు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ భక్తులకు కఠినమైన నిబంధనలు అమలు చేసే ఆలయ అధికారులు, ప్రముఖుల విషయంలో నిబంధనలను ఎందుకు గాలికొదిలేశారని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ గెస్ట్‌హౌస్‌లో ఇలాంటి కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ఆలయ పాలకమండలి, అధికారుల తీరును కూడా తప్పుబడుతున్నారు.మరోవైపు, సాయి తేజ్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ఆలయంలో కాకుండా, కేవలం గెస్ట్‌హౌస్‌లో మాత్రమే అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేశారని, దీనిని అనవసరంగా వివాదం చేయవద్దని వారు కోరుతున్నారు