
Markapuram: కూటమి నేతల భారీ ర్యాలీ వైఎస్సార్‌సీపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం Markapuram: మార్కాపురం లో డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ–2025 అభ్యర్థులతో కలిసి మార్కాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి దోర్నాల బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ “దగా డీఎస్సీ” అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల నిరుద్యోగ యువతలో అనవసర గందరగోళం ఏర్పడుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగలేదని కోర్టులు స్పష్టం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఆన్‌లైన్ విధానం, జంబ్లింగ్ సిస్టమ్‌లో పరీక్షలు నిర్వహించడంతో ప్రశ్నపత్రం లీక్ అయ్యే అవకాశం లేదని తెలిపారు. డీఎస్సీ–2025 నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి కేవలం 45 రోజుల్లోనే ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రినారా లోకేష్ కు అభ్యర్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అర్హత సాధించిన డీఎస్సీ అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని జనసేన ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు