
దేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై పార్లమెంటరీ సంఘం ఆందోళన..! దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 20 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరితో ఆరు నెలలకోసారి తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యువతలో సైతం మూత్రపిండాల వ్యాధులు తీవ్రరూపం దాల్చడంపై పార్లమెంటరీ ప్యానెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చాలామందికి కిడ్నీలు గణనీయంగా దెబ్బతినే వరకు వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదని పేర్కొంది. మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు కఠిన వాతావరణంలో పనిచేసే వ్యవసాయ కూలీలు, డీహైడ్రేషన్, కలుషిత నీటిలోని భార లోహాల ప్రభావం కూడా దీనికి కారణమవుతున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా 'ఉద్దానం' ప్రాంతంలో ప్రబలుతున్న తీవ్ర కిడ్నీ వ్యాధుల సమస్యను కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సరైన వైద్య వసతులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య జటిలమవుతోందని, పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వ్యాధి నిర్ధారణ విధానంలో మార్పులు తీసుకురావాలని కమిటీ కోరింది. కేవలం సీరం క్రియాటినిన్ పరీక్ష మాత్రమే కాకుండా, ఈజీఎఫ్ఆర్, యూరిన్ అల్బుమిన్, ప్రొటీన్ పరీక్షలను కూడా తప్పనిసరిగా చేయాలని సూచించింది. ల్యాబ్‌లు క్రియాటినిన్ నివేదికలోనే అదనపు రుసుము లేకుండా ఈజీఎఫ్ఆర్ విలువను ముద్రించేలా నిబంధనలు తేవాలని ప్రతిపాదించింది. క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక చేయూతతో పాటు ప్రత్యేక ఆరోగ్య బీమా వర్తింపజేయాలని కమిటీ సిఫారసు చేసింది. మారుమూల, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధరలకే డయాలసిస్ సేవలు అందేలా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని నొక్కి చెప్పింది. ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వ్యాధి నివారణ ప్రచార కార్యక్రమాలను ఇంటింటికీ