
అమెరికాలో వేటూరి సాహితీ మహోత్సవం ఘనంగా జరిగింది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వేటూరి సాహిత్య సంకలనాలను ఆవిష్కరించారు. గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి (Veturi Sundararama Murthy) సాహిత్యం అద్వైత సిద్ధిని, అమరత్వ లబ్దినీ పొందిందని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavithula Ramalingeswara Rao) అన్నారు. ఆదివారం డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్రిస్కోలో జరిగిన వేటూరి సాహితీ మహోత్సవం (Veturi Sahiti Mahotsavam)లో ఆయన రచించిన సినీ గీతాల సంపుటాలను జొన్నవిత్తుల ఆవిష్కరించి, వేటూరి వద్ద శిష్యరికం చేసిన జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు. ‘కవుల్లో వివేకుడు, వాచకుడు, రౌచికుడు, ఆర్ధికుడు, శిల్పి, భూషణార్ధి, మార్ధవకవి.. అని ఏడు రకాలు ఉంటారు. కానీ ఆ ఏడుగురు ఒకే వ్యక్తిలో ప్రస్ఫుటిస్తే అది వేటూరి. డిజిటల్ యుగంలో వేటూరి సాహిత్యం గ్రంథస్తం కావడం భావితరాలకు అందజేసే గొప్ప బహుమతి’ అని ఆయన అన్నారు. వేటూరితో తనకున్న అనుబంధాన్ని వేటూరి సాహిత్యాభిమాన సమితి(అమెరికా) వ్యవస్థాపకుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ నెమరువేసుకున్నారు. రూ.40 లక్షల ఖర్చుతో రూపొందించిన ఈ సాహితీ సంకలనాల విడుదలకు సహకరించిన ప్రవాస దాతలను ‘శుభం’ ఫౌండేషన్ నిర్వాహకుడు పొణంగి గోపాల్‌తో కలసి తోటకూర ప్రసాద్ సత్కరించారు. 2004లో తన సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలన్న వేటూరి ఆలోచన 22 ఏళ్ల తర్వాత కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని వేటూరి కుటుంబ సభ్యులు పంపిన సందేశంలో పేర్కొన్నారు