
తాను మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు. తన జీవితంలో ఎప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో ఉద్యమకారులు, కార్మికులు, చిన్న కాంట్రాక్టర్ల కోసం పోరాడానని గుర్తుచేశారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన వారికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత స్థాయిలో దూషణలు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల పట్ల గౌరవం పాటించాలని సూచిస్తూ, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల మూలాలపై కవిత ప్రశ్నలు లేవనెత్తారు. ఆ నిధులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ల నుంచి క్విడ్ ప్రోకో రూపంలో వచ్చాయా అని ప్రశ్నించారు. ఆ డబ్బును రాజకీయ అవసరాలకు కాకుండా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్‌పై కూడా ఆమె పలు ఆరోపణలు చేశారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు అక్రమ అనుమతులు ఇచ్చారని, ఫీనిక్స్ సంస్థకు భారీ విలువైన భూములు కేటాయించారని ఆరోపించారు. ఆ సంస్థ అటవీ ప్రాంతాల్లో భారీ స్థాయిలో కలప నరికేస్తోందని, దీనిపై నమోదైన కేసులను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఇటీవల రూ.188 కోట్లతో ఒక ఆంగ్ల పత్రికను కొనుగోలు చేశారంటూ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావుపై ఆరోపణలు చేస్తూ, ఆయనను ముందుంచుకుని బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోందని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పనిచేయకపోయినా, ప్రత్యామ్నాయంగా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా కూడా ప్రాజెక్టు రిజర్వాయర్లకు నీరు అందించవచ్చని తెలిపారు