
దిల్లీ: ఏడాది క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనీమూన్ మర్డర్’ కేసు న్యాయపరమైన చిక్కుముళ్లతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భర్త హత్య కేసులో నిందితురాలైన సోనమ్ రఘువంశీని అరెస్టు చేయడం చెల్లదంటూ ఆమెకు దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడం, దీనిని మేఘాలయ హైకోర్టు సమర్థించడం, ఆ బెయిల్ నిలిపివేతకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించడానికి గల కారణాలు చర్చనీయాంశమయ్యాయి. నిందితురాలిపై జారీ అయిన అరెస్టు మెమోలో హత్యానేరం సెక్షన్‌ను తప్పుగా పేర్కొనడం క్లరికల్ తప్పిదమని, అక్షర దోషం వల్లే సాంకేతికమైన పొరపాటు జరిగిందని మేఘాలయ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ శ్రీచంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అక్షర దోషం కారణంగా నిందితురాలి అరెస్టు చెల్లదని పేర్కొనడం ఎంత వరకు సబబని మెహతా ప్రశ్నించారు. సాంకేతికమైన అక్షర దోషం కంటే నేర తీవ్రతకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అక్షర దోషం కారణంగానే నిందితులకు బెయిల్ మంజూరును మేఘాలయ హైకోర్టు సమర్థించిందా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. న్యాయపరమైన ఈ సమస్యను విస్తృత ధర్మాసనం ముందుకు తీసుకెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సోనమ్ రఘు వంశీకి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను నిలిపివేసేందుకు జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు సభ్యులుగా ఉన్న సుప్రీం ధర్మాసనం నిరాకరించిన విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు