అకాలీ దళ్ అధినేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం దాడి జరిగింది. గురుద్వారాలో ఆయనపై నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో దాడిచేసినట్టు వర్గాలు తెలిపాయి

అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్

ఇంటర్నెట్ డెస్క్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గురుద్వారా సమీపంలో ఓ వ్యక్తి ఆయనపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో బాదల్ కుడి చేతికి గాయమైంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి జరిగిన సమయంలో బాదల్ సతీమణి, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సైతం ఆయన వెంటే ఉన్నారు. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. 2024 డిసెంబర్‌లోనూ బాదల్‌పై ఓసారి హత్యాయత్నం జరిగింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపారు. అయితే, బుల్లెట్ గురితప్పడంతో ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. దుండగుడిని పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ తనయుడే సుఖ్‌బీర్ సింగ్ బాదల్. 2009 నుంచి 2017 వరకు రెండు పర్యాయాలు పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. సుఖ్‌బీర్‌పై దాడి విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. నాందేడ్ ఎస్పీతో మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మరోవైపు, తమ చీఫ్‌పై దాడిని శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా ఖండించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి