
ఇంటర్నెట్‌డెస్క్: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మరోసారి మూసివేసినట్లు ఇరాన్ (Iran) ప్రకటించడం, నౌకలపై దాడులు చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాణిజ్య, విహార నౌకలతోపాటు, చేపల బోట్లును కూడా నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఖతార్ రాజధాని దోహాపై ఇవాళ ఉదయం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్నింటిని ఖతార్ రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కొందరు పౌరులకు తీవ్ర గాయాలైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు తమ సేనలు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ఖతార్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఒమన్ మండిపడింది. అమెరికా స్థావరాలపై దాడుల పేరిట తమ భూభాగంపై బాంబులు ప్రయోగించడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ఒమన్‌లోని ఇరాన్ రాయబారికి సోషల్ మీడియా వేదికగా నిరసన తెలిపింది. ‘‘ఇరాన్ బాధ్యతారాహిత్యమైన చర్యలపై ఒమన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. దేశ సార్వభౌమాధికారం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం తదితర నిబంధనలకు కట్టుబడి ఉండటం అత్యంత అవసరం’’ అని ఒమన్ ప్రభుత్వం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. హర్మూజ్ జలసంధిపై చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రికి ఒమన్ ఆతిథ్యం ఇచ్చిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి