
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం సరికొత్త స్థాయికి చేరింది. సంగారెడ్డిలో జరిగిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా రాజకీయ వేదికగా మార్చుకున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ విధానాలే లక్ష్యంగా నిప్పులు చెరిగిన సీఎం, ఆ పార్టీని బీజేపీతో ముడిపెడుతూ ‘ఒకే నాణేనికి బొమ్మా బొరుసు’ అంటూ సంధించిన రాజకీయ బాణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నాడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైతులనుద్దేశించి ‘వరి వేస్తే ఉరి’ అంటూ సాగు చేయవద్దని హెచ్చరించిన విషయాన్ని రేవంత్ గుర్తుచేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “రైతులకు వరి వద్దని చెప్పినవారే తమ ఫాంహౌస్‌లోని వందలాది ఎకరాల్లో దర్జాగా వరి పండిస్తున్నారు” అంటూ కేసీఆర్ ద్వంద్వ వైఖరిని నేరుగా టార్గెట్ చేశారు. రైతుల సంక్షేమంలో తమ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉందని నిరూపించేందుకు రేవంత్ రెడ్డి గణాంకాలను తెరపైకి తెచ్చారు. తమ హయాంలో రైతులు పండించిన వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, కాంగ్రెస్ హయాంలోనే ‘రైతు నిజమైన రాజు’ అయ్యాడని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రైతు రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేకపోయారని, తాము అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని స్పష్టం చేశారు. రేషన్ వ్యవస్థను పేదల ఆత్మగౌరవంతో ముడిపెడుతూ బీఆర్‌ఎస్‌ను రేవంత్ తీవ్రంగా నిలదీశారు. గత పాలకులకు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. “గతంలో మీరు ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని పేదలు వండుకుని తినలేకపోయారు. కానీ మేము అందిస్తున్న సన్న బియ్యం పేదల ఆకలిని తీర్చడంతో పాటు ఓపెన్ మార్కెట్‌లో బియ్యం ధరలు అదుపులో ఉండేలా చేసింది” అని