
Supreme Court: దేశంలో చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు రహదారులపై తిరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సరైన నష్టపరిహారం అందకపోవడానికి ఇన్సూరెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి బీమా లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధన విక్రయాలను నిరాకరించేలా ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ అంశంపై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నిబంధన అమలులో కొన్ని ఆచరణాత్మక సవాళ్లు, ఆందోళనలు ఉన్నాయని తెలుపగా, సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. “మీరు ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా అమలు చేయాల్సిందే” అని స్పష్టం చేస్తూ, దీనిని ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించవచ్చని సూచించింది. చమురు సంస్థలు, పెట్రోల్ డీలర్లతో చర్చించి అమలు దిశగా అడుగులు వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు సంబంధించి పక్కా ప్రణాళికను, నిర్దిష్ట టైమ్‌లైన్‌ను తదుపరి విచారణ నాటికి కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. నిబంధనలు పాటించని వాహనదారులకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సంచలన కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది