
ఝార్ఖండ్‌లో తమ అభిమాన హెడ్ మాస్టర్‌ను బదిలీని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఫలించింది. విద్యార్థుల పట్టుదల ముందు అధికారులు తలొగ్గక తప్పలేదు. మూడు రోజుల పాటు ఉద్ధృతంగా సాగిన నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.గఢ్వా జిల్లా కండి బ్లాక్‌లోని ప్రభుత్వ ప్లస్ టూ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మలయ్ కుమార్ సింగ్‌ను అధికారులు ఇటీవల బదిలీ చేశారు. ఆయన హయాంలో పాఠశాల గణనీయమైన అభివృద్ధి సాధించిందని భావించిన విద్యార్థులు, ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని కండి-భవనాథ్‌పూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. "మా సార్ మాకే కావాలి" అంటూ నినాదాలు చేస్తూ గంటల తరబడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. గురువారం నాడు ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పేందుకు వచ్చిన కండి బ్లాక్ చీఫ్ సత్యేంద్ర పాండే, ఒక విద్యార్థిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఆయన వాహనంపై దాడి చేశారు. రక్షణ కోసం ఆయన సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం పొందగా, కొందరు విద్యార్థులు స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి తలకు గాయమైంది.పరిస్థితి తీవ్రతను గమనించిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విద్యార్థులతో చర్చలు జరిపారు. వారి డిమాండ్‌కు అంగీకరిస్తూ ప్రధానోపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో ఫోన్‌లో ఆయనను మాట్లాడించడంతో వారు శాంతించి, తమ ఆందోళనను విరమించారు