
దివంగత నటుడు శ్రీహరిని దర్శకుడు బాబీ కొల్లి గుర్తు చేసుకున్నారు. దివంగత నటుడు శ్రీహరిని (Srihari) దర్శకుడు బాబీ కొల్లి (bobby Kolli) గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 15న ఆయన జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. తన సినీ ప్రయాణంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో శ్రీహరి తనకు ఎంతో అండగా నిలిచారని బాబీ కొల్లి తెలిపారు. తనను ప్రోత్సహించడంతో పాటు, తనపై ఎంతో నమ్మకం ఉంచారని గుర్తుచేసుకున్నారు. “నా తొలి అడుగుల్లో నాకు తోడుగా నిలిచి, ఎంతో ఆప్యాయతతో ప్రోత్సహించిన శ్రీహరి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటున్నాను. మీరు చూపించిన ప్రేమ, నాపై ఉంచిన నమ్మకం ఎప్పటికీ మరిచిపోలేనివి. మీరు లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. We miss you Anna” అంటూ బాబీ కొల్లి భావోద్వేగ పోస్ట్ చేశారు. శ్రీహరి తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ఆయన నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాబీ, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య’ తర్వాత వీరిద్దరి కలయిక వస్తున్నా చిత్రమిది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఓ ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన.. తన కొత్త సినిమా టైటిల్ ‘కదిరి..’ అంటూ నోరు జారారు. ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల కానున్నట్లు కూడా హింట్ ఇచ్చారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది


