
ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్: ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు కోసం అత్యున్నత న్యాయస్థానాల వరకూ వెళ్లారని ముఖ్యమంత్రి విమర్శించారు. అయినా చిత్తశుద్ధితో కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మైనారిటీల ప్రతిభా సదస్సుకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మైనారిటీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నేతృత్వంలోనే మైనారిటీలకు సంక్షేమం అందుతోందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని, హిందూ, ముస్లింలను రెండుకళ్లలా చూస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలను నిర్వహించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను టీజీపీఎస్సీ సభ్యుడిగా నియమించారని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేశామని ధీమా వ్యక్తం చేశారు. రిటైర్డ్ డీజీపీని టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించామని చెప్పుకొచ్చారు. ఎంతో పారదర్శకంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నిఖత్ జరీన్ కోసం నిబంధనలు పక్కనపెట్టి మరీ గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని, అలాగే క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలని కోరారు