
మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్‌నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్‌నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉన్న అమర్‌నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది. అమర్‌నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది. శేష్‌నాగ్ లేక్ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది. యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్‌లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి. కశ్మీర్