
దిల్లీ: యువతుల వస్త్రధారణ వారి వ్యక్తిగత నిర్ణయమని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ‘వారు జీన్స్ ధరించడం యువకుల దుష్ప్రవర్తనకు కారణమవుతుందని చెప్పడం విచారకరం. ఆ తరహా ఆలోచనా ధోరణి ఆమోదయోగ్యం కాద’ని జస్టిస్ చంద్రశేఖరన్ సుధ తెలిపారు. 2013లో ఓ యువతిని వేధించిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. బాలికల వస్త్రధారణను నియంత్రించాలని ప్రయత్నించడానికి బదులు తల్లిదండ్రులు, సమాజం తమ పిల్లల నడవడికను నియంత్రించాలని సూచించారు. వ్యక్తులుగా వారికి ఉండాల్సిన హద్దులను గుర్తెరిగేలా చేయాలని తెలిపారు. పొరుగింటి వ్యక్తి తనను వేధించడంతో పాటు శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. దీనిని ప్రభుత్వం సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తీరును జస్టిస్ చంద్రశేఖరన్ సుధ తప్పుపట్టారు. బాలిక నడవడికను, వస్త్రధారణను నిందించేలా, ఆ ప్రాంతంలోని ఆమె వర్గం వారిని కించపరిచేలా ప్రశ్నించడాన్ని గర్హించారు. నిందితుడిపై కేసును కొట్టివేయడానికి ట్రయల్ కోర్టు చూపిన కారణాలను తోసిపుచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు