
40 ఓవర్ల వన్డేలు, ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్, డబ్ల్యూటీసీ విస్తరణకు ప్రతిపాదనలు అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలపై ఐసీసీ దృష్టి సారించింది. జులై 8న స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మూడు ప్రధాన ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. వీటిలో వన్డే క్రికెట్ భవిష్యత్తు, ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్ పునరుద్ధరణ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విస్తరణ వంటి అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో 12 ఐసీసీ పూర్తి సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. వన్డేలకు ముప్పు..? ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానమైన చర్చ వన్డే క్రికెట్‌కు సంబంధించింది కానుంది. ప్రస్తుతం నాలుగేళ్ల ప్రపంచకప్ చక్రంలో నిరంతరం జరిగే 50 ఓవర్ల మ్యాచ్‌లకు బదులు, ఇకపై ప్రపంచకప్‌కు ముందు కేవలం 18 నెలల కాలంలో మాత్రమే వన్డేలు నిర్వహించేలా ఐసీసీ ఆలోచిస్తోంది. అంటే ప్రతి నాలుగేళ్ల చక్రంలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వన్డేలు లేకపోవచ్చు. అంతేకాకుండా 50 ఓవర్ల వన్డేలను 40 ఓవర్లకు లేదా అంతకంటే తక్కువకు తగ్గించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. టీ20 క్రికెట్ పెరుగుతున్న ఆదరణ, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లకు తగ్గుతున్న వాణిజ్య విలువ ఈ ఆలోచనకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్‌కు పునర్జన్మ..? 2009 నుంచి 2014 వరకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించిన ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) ఆర్థిక సమస్యల కారణంగా 2015లో నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లు విస్తరించడంతో, ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్‌ను ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ టోర్నీ అమల్లోకి వస్తే ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ఎస్‌ఏ20, ది హండ్రెడ్, ఐఎల్‌టీ20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి లీగ్‌ల విజేత జట్లు ఒకే వేదికపై పోటీపడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని పెద్ద క్రికెట్ బోర్డుల