
Cab Booking Rules : క్యాబ్ బుక్ చేసుకునే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణికులను టిప్ ఇవ్వమని ప్రోత్సహించే విధానాలను క్యాబ్ అగ్రిగేటర్లు తమ యాప్‌ల నుంచి తొలగించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముందుగానే టిప్ ఇస్తే క్యాబ్ త్వరగా లభిస్తుందనే భావన కలిగించే సందేశాలు, ఆప్షన్లు చూపించకూడదని స్పష్టం చేసింది. కొన్ని క్యాబ్ బుకింగ్ యాప్‌లలో ‘Advance Tip’, ‘Choose an Add-on’ వంటి ఆప్షన్లు కనిపిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. అంతేకాకుండా టిప్ ఇస్తే డ్రైవర్ ట్రిప్‌ను త్వరగా అంగీకరించే అవకాశం ఉందనే భావన కలిగించే సందేశాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. ఇలాంటి ఫీచర్లు ప్రయాణికులపై అదనపు చెల్లింపు చేయాలనే ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. టిప్ చెల్లించడం వల్ల రైడ్ కన్ఫర్మేషన్, డ్రైవర్ అంగీకారం, డ్రైవర్ కేటాయింపు, వేచి ఉండే సమయం లేదా సేవ నాణ్యత మెరుగుపడుతుందనే అభిప్రాయం కలిగించే ఏ ఫీచర్‌నూ యాప్‌లో చూపించకూడదని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 11న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అన్ని మోటార్ వెహికల్ అగ్రిగేటర్లు తమ మొబైల్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వెంటనే సమీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. టిప్ ఇవ్వండం అనేది పూర్తిగా ప్రయాణికుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఒకవేళ ప్రయాణికుడు టిప్ చెల్లించిన పక్షంలో ఆ మొత్తాన్ని అగ్రిగేటర్ ఎలాంటి కోత లేకుండా డ్రైవర్ అందించాల్సి ఉంటుందని కేంద్ర స్పష్టం చేసింది. అయితే, ఈ తాజా నిర్ణయం వెనుక వినియోగదారులపై అనవసరమైన అదనపు చెల్లింపుల ఒత్తిడిని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది