
కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన పంచాయతీరాజ్ సంస్థలకు మరిన్ని అధికారాలు, నిధులు, సిబ్బందిని బదలాయించాలని, వాటిని స్వయం ప్రతిపత్తి కలిగిన సమర్థవంతమైన స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగబద్ధ హోదా లభించినప్పటికీ అధికారాల వికేంద్రీకరణ విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయని పేర్కొంది. గ్రామసభలను చైతన్యవంతం చేయడం, మహిళా ప్రజాప్రతినిధుల నిజమైన భాగస్వామ్యాన్ని పెంచడం, పంచాయతీల ఆర్థిక స్వావలంబనను పెంచడం అత్యవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు స్థాయీ సంఘం అధ్యక్షుడు సప్తగిరి శంకర్ ఉలాకా నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రెండ్రోజుల కిందట పార్లమెంట్‌కు సమర్పించింది. అందులో కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసింది. పేరుకే మూడంచెల వ్యవస్థ.. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ, మధ్యంతర, జిల్లా స్థాయిల్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ రక్షణ లభించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటు వంటివి తప్పనిసరయ్యాయి. అయితే పంచాయతీలకు దఖలు పరిచాల్సిన విధులు, అధికారాలు, ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛ కారణంగా దేశవ్యాప్తంగా అమలులో గణనీయమైన తేడాలు ఏర్పడ్డాయని కమిటీ గుర్తించింది. పంచాయతీలకు అధికారాల బదలాయింపును కొలిచే డెవల్యూషన్ ఇండెక్స్‌లో దేశ సగటు 2013–14లో 39.9 శాతం ఉండగా.. 2021–22 నాటికి 43.9 శాతానికి పెరిగింది. పురోగతి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు మరింత అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. ప్రాక్సీ ప్రాతినిధ్యానికి చెక్.. గ్రామసభలు ప్రజలకు నేరుగా పాలనలో భాగస్వామ్యం కల్పించే అత్యంత కీలక వేదికలైనప్పటికీ.. సమావేశాల్లో ప్రజల పాల్గొనడం తగ్గిపోతుండటంతో అవి క్రమంగా లాంఛనప్రాయ కార్యక్రమాలుగా మారుతున్నాయని కమిటీ పేర్కొంది. మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలు గ్రామసభల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అవసరమైన