
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు సాక్షి రంగారావు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరాడంబరమైన వ్యక్తిత్వం, వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. దర్శకుడు బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణలు సాక్షి చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నప్పుడు, పాతికేళ్ళు కూడా నిండని ఓ యువకుడు వారి ఆఫీసుకు వచ్చాడు. చేతిలో రాచకొండ విశ్వనాధ శాస్త్రి రాసిన సిఫార్సు లేఖ. ఆ యువకుడే రంగారావు. రావిశాస్త్రి సిఫార్సుతో, నాటక రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి, సాక్షి చిత్రంలో అవకాశం కల్పించారు బాపు-రమణలు. రంగారావు అసలు ఇంటిపేరు రంగావజ్ఝల. 1942 సెప్టెంబర్ 15న కృష్ణా జిల్లా, గుడివాడ పక్కనే ఉన్న కింది పర్రు గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణగారు చిన్నప్పుడే మరణించడంతో, తల్లి రంగనాయకమ్మ ఆధ్వర్యంలో పామర్రులో తన పెద్దమ్మ బుచ్చిరావమ్మ ఇంటి వద్ద పెరిగారు. చదువు పూర్తయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు. అక్కడే ఆయనకు నాటకాలంటే ఆసక్తి కలిగింది. ప్రముఖ రంగస్థల నటులు కుప్పిలి వెంకటేశ్వరరావు వద్ద శిష్యరికం చేసి, ఆయన ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హాస్య పాత్రలు పోషించడంలో ఆయనకు మంచి ప్రజ్ఞ ఉండేది. మద్రాసు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మిత్రుల ప్రోత్సాహంతో, రావిశాస్త్రి సిఫార్సు లేఖతో సినీ పరిశ్రమకు వచ్చారు. మద్రాసు చేరుకున్న రంగారావు ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరిగా బాపు-రమణలను కలిసి సాక్షి చిత్రంలో అవకాశం పొందారు. ఈ చిత్రంలో కరణం పాత్రను అద్భుతంగా పోషించి, తన వయసుకు మించిన వేషంలో నలుగురి దృష్టిని ఆకర్షించారు. తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకొని సాక్షి రంగారావుగా చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. అప్పటి నుండి సాత్విక, హాస్య, విలన్ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు సాక్షి రంగారావు అంటే ఎంతో ఇష్టం. తన ప్రతి చిత్రంలోనూ ఆయనకు మంచి వేషం ఇచ్చేవారు. శంకరాభరణం సినిమాలో