
పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్‌లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది. పోక్సో ప్రత్యేకత ఏంటి? ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్‌కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో