
బిహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని మార్చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ.. ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించింది. అయితే.. గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గి, నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది. దీంతో అసలు ఈ హఠాత్పరిణామం వెనుక కారణమేంటన్న ప్రశ్న బిహార్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బాంకిపూర్ బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గం. 1995 నుంచి ఈ స్థానం ఆ పార్టీ చేతిలోనే ఉంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ఎంచుకుంది బీజేపీ. దీంతో గురువారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా ఎన్‌డీఏ అగ్రనేతల సమక్షంలో అభిషేక్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. గంటలు కూడా తిరగక ముందే సీన్ మారింది. శుక్రవారం అనూహ్యంగా ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో.. పెద్దగా చదువుకోని బంటీని బరిలోకి దింపడం సబబు కాదని బీజేపీ భావించిందనే ప్రచారం ఉదృతంగా జరిగింది. అయితే దానిని బంటీ కొట్టిపారేశారు. "వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయడం సాధ్యం కాదని" రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగికి లేఖ రాసి తప్పుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో కూడా అదే కారణాన్ని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ బంటీ తండ్రి రవీంద్ర ప్రసాద్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి దాణా (ఫోడర్) కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి. 2022లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూతో పాటు మరో 75 మందికి శిక్ష విధించగా