
Pawan Kalyan Health Update: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శస్త్ర చికిత్స విజయవంతమైంది.. ముంబైలో పవన్ కుడి భుజానికి విజయవంతంగా రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల వివరాల ప్రకారం, పవన్ కల్యాణ్ రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ గాయాలతో బాధపడుతున్నారు. 2016లో తగిలిన గాయాలు కాలక్రమేణా తీవ్రంకావడంతో పాటు పోరాట యాత్ర, వారాహి యాత్రల సమయంలో మరింత ప్రభావం చూపినట్లు గుర్తించారు. అభిమానులతో తరచూ కరచాలనాలు చేయడం, చేతులు పట్టి లాగడం వల్ల కూడా భుజాలపై అదనపు ఒత్తిడి పడినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కండరాల చీలికలు, రొటేటర్ కఫ్ గాయాలు స్పష్టంగా బయటపడటంతో వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అన్ని అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం పవన్ కల్యాణ్ ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. మరో రెండు నెలల్లో ఎడమ భుజానికీ శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. ”పవన్ కల్యాణ్‌కి శనివారం ఉదయం ముంబైలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని వైద్యులకు తెలియచేశారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్