
నాకు 24 ఏళ్లు. నేను బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాను. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నాకు గత ఆరు నెలలుగా గొంతులో ఏదో ముద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొదట్లో తినడానికి, తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ క్రమంగా ఏదైనా తింటే లేదా నీళ్లు తాగితే అవి గొంతులోనే ఇరుక్కుపోతాయేమో, ఊపిరాడక చనిపోతానేమో అనే భయం మొదలై, అన్నం, నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంతో నా బరువు కూడా బాగా తగ్గిపోయింది. ఈఎన్‌టీ స్పెషలిస్టును సంప్రదించాను. ఆయన పరీక్షించి గొంతులో ఎలాంటి సమస్యా లేదని, ఒకసారి సైకియాట్రిస్టును కలవమని సూచించారు. గొంతులో మింగడానికి ఇబ్బంది ఉంటే సైకియాట్రిస్టును ఎందుకు కలవాలన్నది నా సందేహం. – సుజాత, తిరుపతి మీరు పడుతున్న ఇబ్బంది, మీ మనసులోని ఆందోళన అర్థమైంది. అధైర్య పడకండి, సమస్య ఏదైనా... దానికి పరిష్కారం ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘గ్లోబస్ ఫారింజియస్’ లేదా ‘ఫాగోఫోబియా’ అంటారు, అంటే మింగడానికి భయపడటం. మన మనసుకు, శరీరానికి విడదీయరాని సంబంధం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు, శరీరం రకరకాలుగా స్పందిస్తుంది. మీ విషయంలో ఆ ఒత్తిడి గొంతులోని కండరాలను గట్టిగా బిగుసుకుపోయేలా చేసింది, దాంతో ఏదో ముద్దలా అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఇది శారీరక రోగం కాదు, తీవ్రమైన ఆందోళన వల్ల శరీరం చూపే స్పందన మాత్రమే, దీనినే ‘సైకోసోమాటిక్ సింప్టమ్’ అంటారు. రూపాయి నాణెంలో బొమ్మను, బొరుసును ఎలా వేరు చేయలేమో మనిషి మనసును– శరీరాన్ని కూడా వేరు చేయలేము. వాటిలో ఒకటి ఒత్తిడికి లోనయితే మరొకటి స్పందిస్తుంది. ఇలాంటి వాటిని నయం చేయడానికి సైకియాట్రిస్ట్‌లే సరైన నిపుణులు. ఒంట్లో నలతగా ఉంటే జనరల్ ఫిజీషియన్ ను ఎలా కలుస్తామో