
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తే చాలు, వెంటనే దానికొక పార్ట్-2 ఉంటుందని మేకర్స్ ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘ధమాకా’ సీక్వెల్ (Dhamaka 2) గురించిన చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2022లో థియేటర్లలో విడుదలైన ‘ధమాకా’ (Dhamaka) చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్ట్ సృష్టించింది. ఇందులో రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, క్యాచీ సాంగ్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ సక్సెస్ జోష్‌లోనే దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇన్ని రోజులు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో, అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే సందేహాలు ఫ్యాన్స్‌లో తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన స్పందించి ‘ధమాకా-2’పై క్లారిటీ ఇచ్చాడు. ధమాకాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన నిజమేనని, అయితే అంతకంటే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కుదిరితేనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్‌బస్టర్ సినిమాకి సీక్వెల్ తీయడం అంత సామాన్యమైన విషయం కాదని, మొదటి భాగం స్థాయిని ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమా చేయడానికి తాను, రవితేజ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని త్రినాథరావు తెలిపారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడం, ముఖ్యంగా అలాంటి కామెడీ-మాస్ కథలను రాయడం చాలా కష్టంతో కూడుకున్న పనని అంటున్నాడు నక్కిన