
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ‘కొండా వర్సెస్ రేవంత్’ ఎపిసోడ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊహించిన రీతిలోనే మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీకి లిఖితపూర్వక వివరణ కూడా సమర్పించారు. అయితే, సురేఖ ఇచ్చిన ఈ వివరణ కాంగ్రెస్ పెద్దలను సంతృప్తి పరిచిందా? లేక కొండా ఫ్యామిలీ వ్యూహాత్మకంగా వేసిన పొలిటికల్ పావుల్లో ఇదొక భాగమా అన్న చర్చ గాంధీ భవన్ వేదికగా జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. నేరుగా ముఖ్యమంత్రి వైఖరిపైనే బహిరంగంగా విమర్శలు గుప్పించడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. అయితే, ఈ ఆరోపణలు వెలుగుచూసిన సమయంలో మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ వెంటనే వాటిని ఖండించకపోవడం అనేక రాజకీయ అనుమానాలకు తావిచ్చింది. తన కుటుంబంలో ఒక వ్యక్తి పార్టీ అధినాయకత్వంపై, ముఖ్యమంత్రిపై ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే, మంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి మౌనం వహించడమేంటనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కొండా ఫ్యామిలీ ఇదంతా పక్కా ప్రణాళికతోనే నడిపిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. సుస్మితకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాథమిక సభ్యత్వం లేదు. దీనివల్ల ఆమెపై నేరుగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే వెసులుబాటు పార్టీ నాయకత్వానికి లేదు. సభ్యత్వం లేని వ్యక్తి పార్టీ అంతర్గత విషయాలను ప్రశ్నించినా పార్టీ నిబంధనల ప్రకారం వేటు వేయడం సాధ్యం కాదు. ఈ లొసుగును అస్త్రంగా మలుచుకుని, తమ మనసులోని అసంతృప్తిని, అసహనాన్ని కుమార్తె ద్వారా సీఎంకు చేరవేసే వ్యూహాన్ని కొండా దంపతులు అమలు చేశారనే భావన కాంగ్రెస్ హైకమాండ్‌లో బలంగా ఏర్పడింది. అంటే