
1995లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పోటీ చోటు చేసుకుంది. రిక్షా కార్మికుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని రెండు చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నటించిన రిక్షావోడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించిన ఒరేయ్ రిక్షా. ఈ రెండు చిత్రాలు కేవలం చిత్ర ప్రముఖులనే కాదు, ప్రేక్షకులను కూడా ఆకర్షించి, వాటి నిర్మాణ విశేషాలపై ఆసక్తిని రేకెత్తించాయి. ఒరేయ్ రిక్షా చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, రిక్షావోడు చిత్రానికి ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ గురుశిష్యుల పోటీని సినీ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఈ రెండు చిత్రాల్లో రిక్షావోడు చిత్రం షూటింగ్ ముందుగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రానికి నిర్మాత అయిన క్రాంతికుమార్, ఆయన శిఖరాగ్రానికి ఎదిగిన తర్వాత రిక్షావోడు చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా కోదండరామిరెడ్డిని అనుకున్నప్పటికీ, చివరి క్షణంలో జరిగిన మార్పుల వల్ల కోడి రామకృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. రిక్షావోడు చిత్రంలో చిరంజీవి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో దాదాపు 15 నిమిషాల నిడివి గల తండ్రి ధర్మారాయుడు పాత్ర ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ పాత్రకు జయసుధ జోడీగా నటించారు. మెగాస్టార్ సరసన సౌందర్య తొలిసారిగా నటించిన చిత్రమిది. అంతేకాదు, ఆమె ఇందులో పూర్తి మాస్ క్యారెక్టర్ పోషించారు. మరో కథానాయికగా నగ్మా నటించారు. రిక్షావోడు ప్రారంభమైన రెండు నెలలకు నారాయణమూర్తి నటించిన ఒరేయ్ రిక్షా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో నారాయణమూర్తి రిక్షా పుల్లర్ సూర్యంగా నటించారు. దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ పతాకంపై దాసరి నారాయణరావు నిర్మించిన తొలి చిత్రం ఇదే. నారాయణమూర్తి కట్టుబడి ఉన్న బాటలో, ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా దాసరి ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్యం భార్యగా రవళి, అతని చెల్లెలుగా మధురిమ నటించారు. ప్రజా