
టెట్ సమస్యపై ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం అందజేసిన ముగ్గురు ఉపాధ్యాయులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడాన్ని వైసీపీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను, ఉపాధ్యాయులను వంచించడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని భూమన ఆరోపించారు. ఎన్నికల సమయంలో టీచర్లను నమ్మించి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను నిర్వహించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల మనోభావాలతో, వారి భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ టీచర్లు తమ హక్కుల కోసం చేసే పోరాటానికి వైసీపీ పరిపూర్ణ మద్దతు ఇస్తుందని భూమన స్పష్టం చేశారు. ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు