
భారత రైల్వేలో ఇక కొత్త శకం మొదలుకానుంది. ఇన్నాళ్లు నల్లటి పొగలు కక్కుతూ పరుగులు పెట్టిన డీజిల్ ఇంజిన్ల స్థానంలో.. పర్యావరణానికి మిత్రంగా నిలిచే ఓ కొత్త తరం రైలు భారత్‌లో అడుగుపెట్టబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పరుగులు పెట్టే ఈ రైలు భారత రైల్వే రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలకనుంది. భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును సిద్ధం చేస్తున్నాయి. హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలును తొలిదశలో పరీక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రైలు పనిచేసే విధానం కూడా ఆసక్తికరమే. సాధారణ రైళ్లలా డీజిల్ దహనం కాదు.. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా ఫ్యూయల్ సెల్‌లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో రైలు కదులుతుంది. ఈ ప్రక్రియలో వెలువడేది ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. అంటే పొగ లేదు.. కాలుష్యం తక్కువ. భారత్ రూపొందిస్తున్న ఈ హైడ్రోజన్ రైలు సాధారణ రైలు కాదు. ఇది 10 కోచ్‌లతో, రెండు డ్రైవింగ్ పవర్ కార్లతో రూపొందుతోంది. సుమారు 2,400 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో భారత బ్రాడ్‌గేజ్ మార్గాల్లో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ రైలు వెనుక భారత రైల్వే పరిశోధన సంస్థ RDSO కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం హర్యానాలోని జింద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో ఈ రైలు గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ సాంకేతికత భారత్‌కు కొత్త కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి. హైడ్రోజన్ రైలును వాణిజ్య ప్రయాణికుల సేవల్లో తొలిసారిగా ఉపయోగించిన దేశం జర్మనీ. 2022లో జర్మనీ