
మహాత్మా గాంధీ స్వయంగా రాసిన అరుదైన చేతిరాత డైరీ వేలంలో రూ.16.20 కోట్ల భారీ ధర పలికింది. ముంబైలోని సాఫ్రాన్‌ఆర్ట్ నిర్వహించిన వేలంలో ‘ఎ థాట్ ఫర్ ది డే’ సంకలనం ఈ రికార్డు సృష్టించింది. భారతీయ చారిత్రక పత్రానికి వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదేనని వేలం సంస్థ వెల్లడించింది. గాంధీజీ తన సన్నిహితుడు ఆనంద్ టి. హింగోరాని కోసం రాసిన 688 రోజువారీ ఆలోచనలు ఇందులో ఉన్నాయి. కొనుగోలుదారు భారతీయుడేనని సంస్థ తెలిపింది, అయితే ఆయన గుర్తింపును మాత్రం బహిర్గతం చేయలేదు. గాంధీజీ ఈ రోజువారీ ఆలోచనలను 1944 నవంబర్ 20 నుంచి 1946 అక్టోబర్ 10 వరకు రాశారు. దాదాపు 23 నెలల కాలంలో ఆయన చేతిరాతతో మొత్తం 688 ఆలోచనలు ఈ సంకలనంలో నమోదయ్యాయి. హింగోరాని భార్య విద్యా మరణం తర్వాత ఆయనకు ఓదార్పు, మార్గదర్శకత్వం అందించేందుకు గాంధీజీ ఈ రచనలు ప్రారంభించారు. సత్యం, అహింస, సేవ, ఆత్మసంయమనం, భయరహితత్వం, ప్రార్థన, కర్తవ్యం వంటి అంశాలకు ఇందులో ప్రధాన స్థానం ఉంది. రామనామం, అస్పృశ్యతా నిర్మూలన వంటి అంశాలపై కూడా గాంధీజీ వ్యక్తిగత దృక్పథం ఈ చేతిరాత డైరీలో కనిపిస్తుంది. ఆనంద్ టి. హింగోరాని 1930లో తొలిసారి గాంధీజీని కలుసుకుని, అనంతరం సబర్మతి ఆశ్రమంలో పనిచేశారు. దండి మార్చ్, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో ఆయన తన పాత్ర పోషించారు. దీంతో గాంధీజీతో హింగోరానికి ఏర్పడిన అనుబంధం రాజకీయ పరిధిని దాటి వ్యక్తిగత స్థాయికి చేరుకుంది. తర్వాత గాంధీ రచనల ప్రచురణకర్తగా, పోషకుడిగా హింగోరాని కొనసాగారు. ఆయన కుటుంబం ఈ అరుదైన గాంధీజీ చేతిరాత డైరీని తరతరాలుగా జాగ్రత్తగా భద్రపరిచింది. ‘గాంధీ: ఫ్రమ్ ది కలెక్షన్ ఆఫ్ ఆనంద్ టి. హింగోరాని’ పేరుతో ఈ ప్రత్యేక వేలం నిర్వహించారు. ఇందులో లేఖలు, చేతిరాత ప్రతులు, ఛాయాచిత్రాలు, రాట్నం, తపాలా బిళ్లలు సహా మొత్తం