
శునకాలకు శస్త్రచికిత్సల పేరుతో నిధుల స్వాహా ఆదోని పట్టణంలో కుక్కలకు కు.ని. శస్త్రచికిత్సలు చేసేందుకు శివారులోని రాంజల చెరువు ప్రాంతంలో ఏబీసీ శస్త్రచికిత్స గది ఏర్పాటు చేశారు. గతేడాది ఆరంభంలో కొన్ని శునకాలను పట్టి చికిత్సలు చేశారు. ఆ తర్వాత ఆపేశారు. దాదాపు అన్ని పురపాలికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యూస్‌టుడే, ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ పురపాలికలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పురపాలక సంఘాల్లో శునకాలకు కు.ని. శస్త్రచికిత్సల పేరుతో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇవి పెద్దఎత్తున పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేవలను ఏజెన్సీలకు అప్పగించి అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి మమ అనిపించేస్తున్నారు. ఒక్కో శునకానికి సంబంధించి కు.ని. శస్త్రచికిత్స చేసి టీకా వేసేందుకు ప్రభుత్వం రూ.1,650 ఖర్చు చేస్తోంది. చికిత్స అనంతరం వారం పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత ఎక్కడినుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేస్తారు. కర్నూలు నగరంలో రెండేళ్లలో 11 వేలు, నంద్యాల పట్టణంలో ఈ ఏడాది జనవరి నుంచి మే 5వ తేదీ వరకు 2,450 చికిత్సలు చేసినట్లు యంత్రాంగం చెబుతోంది. ఆదోనిలో గతేడాది 600 కుక్కలకు కు.ని. చికిత్సలు చేశారు. ప్రస్తుతం సేవలు నిలిచాయి. ఎమ్మిగనూరులో ఈ ఏడాదిలో 350 శునకాలకు పూర్తి చేశారు. డోన్‌లో 2025-26లో 122 కుక్కలకు కు.ని. చికిత్సలు చేసి బిల్లులు చెల్లించేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర పురపాలక సంఘాల పరిధిలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో జనం కుక్క కాట్ల బారిన పడుతున్నారు. ఆదోని పట్టణంలో గణేశ్ కూడలి మీదుగా ఓ ఆర్టీసీ ఉద్యోగి తెల్లవారుజామున విధులకు వెళ్తుండగా కుక్కల గుంపు వెంటపడి గాయపరిచాయి. మూడు నెలల కిందట ఆదోని పురపాలక కార్యాలయ ఆవరణలోనే ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి పది మందిని గాయపరిచింది. నంద్యాల పట్టణంలో అంజుమన్ వీధి, బస్టాండు ప్రాంతం, సంజీవనగర్ గేట్ ప్రాంతంలో ఒకే రోజు 30 మంది