
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో న్యాయపోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనల రూపంలో ఏపీ తీరును తీవ్రంగా ఎండగడుతూ, ఇక రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఏళ్ల తరబడి జరుగుతున్న తాత్కాలిక ఏర్పాట్లకు స్వస్తి పలికి, రెండు రాష్ట్రాల మధ్య శాశ్వత, న్యాయబద్ధమైన నీటి కేటాయింపులు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఎదుట శుక్రవారం జరిగిన విచారణలో తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ బలమైన వాదనలు వినిపించారు. కృష్ణా బేసిన్‌లో రెండు రాష్ట్రాల అవసరాలకు సరిపడా పుష్కలంగా నీరు లభ్యమవుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం అడ్డగోలుగా నీటిని తరలించుకుపోతోందని ఆరోపించారు. వరి సాగుకు అవసరమైన పరిమాణం కంటే అత్యధికంగా నీటిని వినియోగిస్తూ, ఇంకా నీరు చాలదంటూ ఏపీ కొత్త డిమాండ్లు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తప్పుబట్టారు. ఉమ్మడి రాష్ట్రానికి నిర్దేశించిన 811 టీఎంసీల నీటిలో ప్రస్తుతం అమలవుతున్న పంపకాలు కేవలం తాత్కాలిక పరిపాలనా సర్దుబాటు మాత్రమేనని, వాటిని శాశ్వత వాటాలుగా భావించడానికి వీల్లేదని తెలంగాణ గట్టిగా వాదించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిపై పునఃసమీక్ష అవసరం లేదంటూ ఏపీ చేస్తున్న వాదనలను తీవ్రంగా ఖండించింది. ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి కేటాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాటాలను స్పష్టంగా తేల్చాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌పైనే ఉందని గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను పరిష్కరించే, కేటాయింపులు చేసే సంపూర్ణ అధికారం న్యాయబద్ధంగా ఏర్పాటైన ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉంటుందని తెలంగాణ స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 84, 85(8), 87లను ఉటంకిస్తూ.. నీటి వాటాల పంపిణీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు గానీ, పార్లమెంట్‌కు గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చిచెప్పింది. ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టాన్ని తన స్వార్థం కోసం తప్పుగా అన్వయిస్తోందని


