
‘లోతైన భావోద్వేగాలు నిండిన ప్రేమకథతో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఇదొక మంచి క్లాసిక్ లవ్‌స్టోరీగా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్. ‘బేబి’ విజయం తర్వాత ఆయన.. దర్శకుడు సాయి రాజేశ్ కలిసి నిర్మించిన ఈ సినిమాని రవి నంబూరి తెరకెక్కించారు. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించారు. ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ఎస్‌కేఎన్. ‘‘తొలి ప్రేమైనా... మలి ప్రేమైనా జీవితంలో భాగమే. మేము ‘బేబి’ సినిమాని తొలి ప్రేమ నేపథ్యంగా నిర్మించాం. ఇప్పుడీ సినిమాతో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెప్పబోతున్నాం. అలాగని ఇదేమీ విషాదకరంగా ఉండదు. ఇది మాదైన మార్క్ ఉండేలా రూపొందించిన సినిమా. చెన్నైలో నివసించే ఓ తెలుగు జంట చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే దీనికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అని పేరు పెట్టాం. మేము రాసుకున్న కథకి కిరణ్ వందశాతం న్యాయం చేశారు. ఇందులో ఆయన నటనలోని పరిణతిని చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్‌లో తన పేరు నామినేషన్‌లో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. దీంట్లో శ్రీ గౌరి పాత్రకీ చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా ప్రారంభమే ఆమె సీన్‌తో మొదలవుతుంది. ఇంత బలమైన పాత్రకు తను పూర్తిగా న్యాయం చేసింది’’. ‘‘బేబి’ విజయం తర్వాత మాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అందుకే మంచి కథతోనే రావాలని మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాం. ఇది పేరుకు ‘చెన్నై లవ్‌స్టోరీ’ అయినా సింహభాగం చీరాల, వైజాగ్ బీచ్‌లలోనే చేశాం. కొన్ని సన్నివేశాల్ని పాండిచ్చేరి, చెన్నై లైట్ హౌస్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశాం. కథలోని భావోద్వేగాలు బలంగా తెలిసేలా మణిశర్మ దీనికి అద్భుతమైన సంగీతమందించారు. ‘బేబి’ కల్ట్ లవ్‌స్టోరీగా పేరు తెచ్చుకున్నట్లు.. ఈ సినిమా క్లాసిక్ ప్రేమకథగా పేరు తెచ్చుకుంటుంది. ఈ