
Vijayasai Reddy : మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. ప్రజాపక్షంగా ప్రజల గొంతును పార్లమెంట్, అసెంబ్లీలో వినిపించేందుకు ఒక లాయర్‌గా, ప్రజల తరఫు ప్రతినిధిగా రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే, పార్టీ ఏర్పాటు, దాని విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెలలోనే వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో ఎల్‌నినో ప్రభావం లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటి. కొత్త పార్టీ పెడతారా?, వైఎస్సార్‌సీపీలో మళ్లీ చేరతారా? అనే చర్చ కొద్దిరోజులుగా జరుగుతుంది. అయితే, తాజాగా విజయసాయిరెడ్డి కొత్త ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. విజయసాయిరెడ్డి త్వరలో పెట్టబోయే పార్టీ పేరుపై చర్చ జరుగుతోంది. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పేరు ‘ భారత్ జన వికాస్ ‘ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. ఆ పార్టీకి ఏం పేరు పెట్టబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఈ నెలలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులోగా ఆయన పెట్టబోయే పార్టీ పేరు ఏమిటి అనే అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది