
కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తమ పాఠశాలగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హైస్కూల్ రాష్ట్రస్థాయిలో బెస్ట్‌గా నిలిచిన కార్పొరేషన్ స్కూల్ కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2025-26 విద్యాసంవత్సరానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే (మున్సిపల్ యజమాన్యం విభాగంలో) అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర వేడుకల్లో భాగంగా అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల అవార్డును ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎం. హుస్సేన్ అందుకుంటారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా వరుసగా ఐదోసారి ఎంపికై తమ రికార్డును మరోసారి బద్దలు కొట్టింది. దీంతో ఈ పాఠశాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. కర్నూలు నగరంలో 2016 సంవత్సరంలో ఈ పాఠశాలను ఫౌండేషన్ పాఠశాలగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెలకొల్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫౌండేషన్ పాఠశాలను రద్దు చేశారు. అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలాజీ చొరవతో ఫౌండేషన్ స్కూల్‌గా పేరు మార్చి డా.ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలగా మార్చి గుర్తింపు తీసుకువచ్చారు. మా పాఠశాల అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంలో విద్యార్థుల పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ఉపాధ్యాయులందరూ సమష్టి కృషితో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో వరుసగా ఐదోసారి ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం. - ఎస్‌ఎం హుస్సేన్