
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ పరిష్కారం చూపారు. సోమవారం ఆయన ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం కోసం విచ్చేశారు. ఈ సందర్భంగా, తమ భూములు 22-ఏ నిషేధిత జాబితాలో చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు, మాజీ సైనికులు సీఎం దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే ఆ జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.వివరాల్లోకి వెళితే, సోమవారం కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు హక్కుగా సంక్రమించిన భూములను 22-ఏ జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు చేసుకోలేక, అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న చంద్రబాబు, ప్రజలకు మేలు చేసేలా అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు.సీఎం ఆదేశాలతో ఉనికిలి, కలిదిండి, వైవాక గ్రామాలకు చెందిన 830 కుటుంబాలకు భారీ ఊరట లభించింది. వారికి సంబంధించిన 2,745 ఎకరాల భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. డీనోటిఫికేషన్ అధికారాలను ఆర్డీఓకు కల్పించాలని కూడా ఈ సందర్భంగా సీఎం సూచించారు. అనంతరం, సమస్య పరిష్కారానికి గుర్తుగా లబ్ధిదారులకు 1-బి అడంగల్ ప్రతులను చంద్రబాబు స్వయంగా అందజేశారు.దశాబ్దాలుగా నలుగుతున్న తమ సమస్యకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వెంటనే పరిష్కారం చూపడంతో రైతులు, బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు