
నలభై ఏళ్లుగా ఎదురుచూసిన కల.. ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుని, మళ్లీ నిరాశపడిన లంక గ్రామాల ప్రజలు.. చివరకు వారి కళ్ల ముందే ఆ కల నిజమైంది. రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు పడిన కొల్లేరు లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు రాకతో గ్రామస్తుల కళ్లలో ఆనందంతో పాటూ నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడిన వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఏలూరు, ఆగస్టు 16: జిల్లాలోని కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు లంక గ్రామాల ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. ఇప్పటివరకూ రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెద్దట్లగాడి, పెనుమాక లంక, ఇంగిలిపాక లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏలూరు నుంచి ఈ లంక గ్రామాల వరకూ నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో లంక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులు ఇకపై తగ్గనున్నాయని స్థానికులు పేర్కొన్నారు. బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో పాటు కూటమి నాయకులు కూడా బస్సులో ప్రయాణించి లంక గ్రామాల ప్రజలతో మమేకమయ్యారు. తమ ప్రాంతానికి బస్సు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరేందుకు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ఈ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రజల రవాణా సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికుల్లో ఆనందం నెలకొంది. రహదారి నిర్మాణానికి కృషి చేసిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు