
గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రయాణం, ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో అనుబంధం, విలక్షణ నటన, గుర్తుండిపోయే పాత్రలు, ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని తనదైన శైలిలో నటించి తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసిన విశిష్ట నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు (Gummadi Venkateswara Rao) ఒకరు. ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెబితే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్దిమందే ఉన్నారు. అటువంటి వారిలో మొదటి వరుసలో నిలిచిన వ్యక్తి గుమ్మడి. సుస్పష్టమైన వాచకం ఆయన సొంతం. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం.. జానర్ ఏదైనా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిన గొప్పనటుడు. ముఖ్యంగా సాత్వికాభినయంలో ఆయన దిట్ట. గుమ్మడి శత జయంతి సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్బంగా ఓ ప్రత్యేక కథనం. ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని, వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను, మనస్తత్వాలను పరిశీలించేవారు గుమ్మడి. అప్పుడు తనకు అనుకూలంగా తన పాత్రను మలుచుకుని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెడుతూ నటించేవారు. గుమ్మడి పోషించిన పాత్రలను పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనిషినో, పక్కింటి పెద్దమనిషినో గుర్తు చేస్తాయి. అందుకే తెరపై గుమ్మడి కనిపిస్తే చాలు ఆడియన్స్ రిలీఫ్ ఫీలయ్యేవారు. తెలుగుదనం ఉట్టిపడే పంచె కట్టు, తెల్లని చొక్కా, పైన కండువా... చాలా సినిమాల్లో గుమ్మడి గెటప్ ఇదే. నాలుగు తరాల నటులకు నాన్న వయసులో తనకంటే పెద్ద వారైన అగ్ర నటులు ఎన్టీఆర్, ఏయన్నార్‌లకు తండ్రిగా నటించి మెప్పించారు గుమ్మడి. అంతేకాదు దాదాపు నాలుగు తరాల తారలకు ‘నాన్న’గా నటించిన ఘనత ఆయన సొంతం. నాగయ్య తర్వాత నాన్న పాత్ర అనగానే ఆ రోజుల్లో గుర్తుకు వచ్చిన నటుడు గుమ్మడి మాత్రమే. ఇలా