
ఇంటర్నెట్ డెస్క్: ‘ఎడారి కోత’.. చైనాను కొన్నేళ్లుగా వేధిస్తోన్న సమస్య. సముద్రం కొద్దికొద్దిగా తన తీర ప్రాంతాలను ముంచేసినట్లే.. ఎడారి కూడా తన సమీప ప్రాంతాలను తినేస్తోంది. ఇక్కడ ఏటా వచ్చే ఇసుక తుపానులు.. వందల ఎకరాల భూములను దిబ్బలుగా మార్చేశాయి. దీంతో ఈ ప్రకృతి విలయాన్ని అడ్డుకునేందుకు దాదాపు ఐదు దశాబ్దాల కిందట చైనా (China) ఓ మహాద్భుతానికి శ్రీకారం చుట్టింది. ఎడారికి అడ్డుగా.. హరిత గోడను (Great Green Wall) నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 6600 కోట్ల మొక్కలను నాటి కృత్రిమ అరణ్యాన్ని సృష్టించింది. గోబి.. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎడారి. చైనాకు ఉత్తరం వైపున ఉండే ఈ ఎడారి.. ఇసుక రాశులతో అందంగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఏటా వచ్చే ఇసుక తుపానులను ఎదుర్కోవడం అత్యంత కష్టమైన పని. ఇసుకతో ముంచెత్తుతూ వందల ఎకరాల భూముల్ని తనలో కలిపేసుకుంటోంది. దీనికి భయపడి ఈ ఎడారికి సమీపంలో ఉండే లక్షల కుటుంబాలు వలసవెళ్లడంతో కొన్ని ప్రాంతాల్లో జనసాంద్రత భారీగా తగ్గింది. అటు తక్లమకన్ ఎడారిలోనూ ఇదే సమస్య. ఈ ఎడారుల విస్తరణతో తీవ్రంగా సతమతమైన చైనా.. 1978లో ‘త్రి నార్త్ షెల్టర్‌బెల్ట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. దీన్నే ‘గ్రేట్ గ్రీన్ వాల్’ అని పిలుస్తారు. ఎడారీకరణను, దుమ్ము తుపానులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ నిర్మిత అరణ్యాలను సృష్టించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రోగ్రామ్ కింద 13 ప్రావిన్స్‌ల్లో ఎడారి అంచుల చుట్టూ 4500 కిలోమీటర్ల పొడవున చెట్లతో పచ్చలహారాన్ని నిర్మించ తలపెట్టారు. ఇందులో భాగంగా 1978 నుంచి ఇప్పటివరకు 6600 కోట్ల మొక్కలను నాటినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 2050 వరకు ఈ ప్రాజెక్టును కొనసాగించి.. 10వేల కోట్ల మొక్కలు నాటాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ కింద ఎడారి సమీప ప్రాంతాల్లో యూకలిప్టస్ వంటి వేగంగా పెరిగే, నీటి