
ఇంటర్నెట్ డెస్క్: సాయుధ బలగాల్లో విశిష్ట సేవలు అందించిన సైనికులను (Indian Army) గుర్తించి, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారికి పతకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శౌర్య పురస్కారాలతో పాటు వివిధ ఆపరేషన్లలో తెగువ చూపిన వారిని మెన్షన్-ఇన్-డిస్పాచెస్ జాబితాలో చేర్చి గౌరవించింది. ఇందులో ఓ ప్రత్యేక ‘సైనికుడి’ పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉగ్ర మూకలను వేటాడే ఆపరేషన్‌లో పాల్గొని, అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించిన ‘టైసన్’ (Tyson) అనే సైనిక జాగిలం ఈ గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. భారత సైన్యానికి చెందిన ‘టైసన్’.. జర్మన్ షపర్డ్ జాతికి చెందిన శునకం. రీమౌంట్ వెటర్నరీ కోర్ విభాగానికి చెందిన ఈ జాగిలం.. ప్రస్తుతం 2 పారా ప్రత్యేక దళాల్లో సేవలందిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. కిశ్త్‌వాఢ్ జిల్లాలోని చాత్రూలో జైషే మహ్మద్ ఉగ్రమూకలు (సీనియర్ కమాండర్ సైఫుల్లా సహా ముగ్గురు) ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన సైన్యం.. జమ్మూపోలీస్, సీఆర్‌పీఎఫ్, తదితర విభాగాలతో కలిసి ఆపరేషన్ త్రాషి (Operation Trashi-I) చేపట్టింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి దగ్గరకు చేరుకోగానే.. అందులో దాక్కున్న ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. ఇందులో మొదటి బుల్లెట్ టైసన్ కాలులోకి దూసుకెళ్లింది. అయినా, ఎలాంటి బెరుకూ లేకుండా ఆ జాగిలం ముందుకే సాగింది. అనుసరించి వెళ్లిన భద్రతా దళాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించాయి. జైషే సీనియర్ కమాండర్ సైఫుల్లా సహా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశాయి. అయితే, తీవ్రంగా గాయపడిన టైసన్‌ను హెలికాప్టర్‌లో తీసుకొచ్చి చికిత్స అందించారు. అనంతరం కొన్ని రోజుల్లో ఆ జాగిలం పూర్తిగా కోలుకుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో