
ఈ భూమ్మీద కోటానుకోట్ల వృక్షాలుంటాయి. అయితే కొన్నింటి వెనక ఆసక్తికరమైన కథలుంటాయి. మరికొన్ని వృక్షాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి... స్ఫూర్తినిస్తాయి. అలాంటి చెట్లను గుర్తించడం కోసం ఏటా యూరప్‌లో ‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ద ఇయర్’ పేరుతో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆసక్తికర చారిత్రక నేపథ్యాలున్న కొన్ని చెట్ల చరిత్ర ఇది... ప్రజాస్వామ్యానికి ప్రతీక స్వేచ్ఛ, స్వాతంత్ర్యోద్యమాలతో ఒక చెట్టు ముడిపడి ఉండటం చెక్ రిపబ్లిక్‌లో కనిపిస్తుంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా, జాతీయ గౌరవానికి చిహ్నంగా ‘లైమ్ ట్రీ ఆఫ్ లిబర్టీ’ని గుర్తించారు. చెక్ రిపబ్లిక్‌లో దేశవ్యాప్తంగా అనేక లైమ్ ట్రీలు (లిండెన్) ఉన్నాయి. 1918లో చెకొస్లోవేకియా దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో మొదటి ప్రపంచయుద్ధం ముగియడం, చెకొస్లోవేకియా ఏర్పడటంతో వెల్కె ఒపాటొవిస్‌లోని ప్రజలు ఆనందంతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి చిహ్నాలుగా 16 లైమ్ మొక్కలను నాటారు. యుద్ధంలో పాల్గొని తిరిగి వచ్చిన జాన్ పాస్‌పోసిల్ అనే వ్యక్తితో వాటిని నాటించారు. వాటిలో రోడ్డు మధ్యలో, ఐదు రోడ్ల కూడలిలో ఉన్న ఒక్క చెట్టు మాత్రమే సజీవంగా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు సమావేశాలు జరుపుకొన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా లైమ్ చెట్ల నీడలోనే చేసేవారు. చెక్ జానపద గేయాలు, కళలలో ఈ చెట్టు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కొన్ని గ్రామాల్లో లైమ్ చెట్లను నాటేటప్పుడు చెట్టు వేర్ల దగ్గర చిన్న పెట్టెల్లో సందేశాలు, నాణేలు, ఆ కాలం వార్తాపత్రికలు పెట్టేవారట. భవిష్యత్ తరాలు వాటిని చూసి పూర్వీకుల స్వేచ్ఛ, ఆనందాన్ని గుర్తు చేసుకోవాలని అలా చేసేవారు. ఇప్పటికీ ప్రతీ ఏటా స్థానికులు లైమ్ వృక్షాల వద్ద కార్యక్రమాలు నిర్వహించి, గతాన్ని స్మరించుకుంటారు. పోరాటాలకు వేదికగా... కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్యుబెక్ లిండెన్ చెట్టు క్రొయేషియాలోని గాంజా స్టుబికా గ్రామంలో ఉంది. క్రొయేషియాలో జరిగిన ఎన్నో సంఘటనలకు ఇది సజీవ సాక్ష్యంగా నిలిచింది. 1573లో జమీందారుల దౌర్జన్యాలు, పన్నులకు వ్యతిరేకంగా